ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము
తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు.
ఆయన మన నిమిత్తము తన ప్రాణముపెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము. మనము కూడ సహోదరులనిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై యున్నాము.
1 యోహాను 3:10,16
యేసు ప్రభువును ఒక ధర్మశాస్త్రోపదేకుడు శోధిస్తూ –బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. అందు కాయన–నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై యున్నవని అతనితో చెప్పెను (మత్తయి 22:36-40). ద్వేషం, వ్యతిరేకత, శత్రుత్వం మనిషికి మనిషికీ మధ్య పెచ్చరిల్లడం అనేది నాడే కాదు నేటికీ మన మధ్య జరుగుతున్నదే! అదీ దేవుని పేరిట జరుగుట మరింత విడ్డూరం!!. దేవున్ని నిజంగా ప్రేమించేవాడు, తన కళ్ళముందు కనిపించే మనిషినీ ప్రేమిస్తాడని, తన తోటి సహోదరుని ప్రేమించేవాడు దేవున్ని ప్రేమిస్తూ దైవ సంబంధుడై ఉంటాడని యేసు ప్రభువు ఇక్కడ నొక్కిచెపుతున్నాడు. దైవ ప్రేమ ఏమిటో తన సిలువ త్యాగం ద్వారా లోకానికి యేసుక్రీస్తు చూపాడు. అదే త్యాగ పూరితమైన ప్రేమను క్రీస్తును అనుసరించేవారు ద్వేషపూరతమైన లోకంలో చూపారు ...చూపుతున్నారు.
దేవుడు ప్రేమాస్వరూపి మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను.
మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది.
ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనమొకనినొకడు ప్రేమింప బద్ధులమై యున్నాము.
ఎవడైనను–నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించినయెడల అతడు అబద్ధికుడగును;
తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడ ప్రేమింపవలెనను ఆజ్ఞను మనమాయనవలన పొందియున్నాము.
1 యోహాను 4
మా దర్శనం
దేవుని ఆలోచనలు తలంపులు మనిషి అందుకోలేని ఎత్తులో అర్థచేసుకోలేనంత ఉన్నతమై నిగూఢంమైనప్పటికీ ఎప్పుడూ దేవుడు తను సృజించిన మనిషికి చెప్పకుండా ఏమీ చేయడు. అనాధి కాలం నుండి దేవుడు తన ఉద్దేశాలను జరిగించబోయే కార్యాలను తనతో నడిచే నీతిమంతుల ద్వారా, ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు ‘యెహోవా ఈలాగు సెలవిస్తున్నా‘డని చెపుతూ వచ్చాడు. కాలం గడిచే కొలదీ దేవుని మాటకొరకు కనిపెట్టి ఆయన ఆజ్ఞను శిరసావహించే తత్వాన్ని మనిషి విడిచిపెట్టడమే కాదు, ఆయన్ను తిరస్కరించి ఆయన స్వరాన్ని వినలేనంతటి దూరంగా మనిషి హృదయం బండమారిపోయింది. దేవున్ని ఆయన మాటను లెక్కచేయనంతగా మనిషి తిరగుబాటు చేసినా ప్రేమగల దేవుడు న్యాయవంతుడుగా తాను జరిగించబోయే తీర్పులను గూర్చి చెప్పకుండా లేడు! ఆనాటి హబక్కూకు ప్రవక్తకు దర్శనాన్ని బయలుపరిచి తమ దుష్టత్వంలో మనిషి పరుగులు తీస్తున్నా అతడు చదవగలిగే విధంగా లిఖించమని చెప్పాడు. పౌలు 2వ తిమోతి 3 వ అధ్యాయంలో ‘అంత్యదినములలో అపాయకరమైన కాలములు వస్తాయని, మనుషులు గర్వంధులై దేవుని కంటే లోక సుఖానుభవాలను ఎక్కువగా ప్రేమిస్తూ పాపభరితమైన
నానా దురాశల వెంట పరుగుతలు తీస్తారని వేల సంవత్సరాల క్రితమే హెచ్చరించాడు. దురదుష్టవశాత్తు నేడు మనం అటుంవంటి ఘడియలలో గడుపుతున్నాము. దేవుని మాటను వినడం కాదుగదా సర్వోన్నతుడైన దేవున్నే తిరస్కరించి ద్వేషించే మనుషుల మధ్య గడుపుతున్నాము. “పూర్వకాలమందు నానాసమయములలోను నానా విధములుగాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను“ అని హెబ్రీ 1:1 లో చెప్పబడింది. యేసు ప్రభువు సిలువలో వ్రేలాడుతూ విలువ కట్టలేని తన దివ్యప్రేమను వ్యక్తపరుస్తున్నప్పటికీ క్రింద ఉన్న రోమాభటులు ఆయన అంగీకొరకు చీటిలు వేస్తున్నట్లు నేటి ప్రజలు తమ దుష్టత్వాన్ని పోగుచేసుకొనే విషయంలో పరుగులు పెడుతున్నవారుగా ఉన్నారు. ఈలా పరుగులు పెట్టి మనిషి కళ్ళకు మా ప్రయత్నంగా దేవుని సందేశాన్ని వివిధరూపాలుగా వారి కన్నులకు ప్రత్యక్షపరచాలనే ఉద్ధేశంతో ‘హబక్కూకు2రెండు‘ అనే రిఫరెన్సుతోనే మా మినిష్ట్రీని స్థాపించాము. లోకానికి తక్కువ సమయంలో సులభంగా డిజిటల్ రూపంలో దేవుని సందేశాలను అందించాలనే సదుద్దేశంతో ముందుకు సాగుతున్నాము.