నావాళ్ళనే
దేవుడు ఎందుకు తీసుకెళ్ళిపోయాడు?
ప్రపంచంలో కోవిడ్ నెమ్మదిస్తున్న రోజులు. ప్రజలు తిరిగి ఎవరి వ్యాపకాలలో వారు బిజీ అయిపోతున్నారు. కాని కోవిడ్ వలన మరణాలను చవి చూసిన కుటుంబాలు తీరని శోకంలోనే గడుపుతున్నాయి. కుటుంబంలో అత్యంత సమీపస్తులను కోల్పోయి నేటికీ అనేకులు దుఃఖంతో కాలం గడుపుతున్నారు. హృదయంలో గూడుకట్టుకుపోయిన దుఃఖంతో పాటు వారిలో వెంటాడుతున్న ప్రశ్న ఒక్కటే! అనేకులు కోవిడ బారిన పడి, బయట పడ్డారు. కాని ఎంతో మంచివాడైనా మావాడే ఎందుకు తనువు చాలించాడు? దేవున్ని నమ్ముకుని, కళ్ళముందు కష్టాలలో వున్నవారిని చూస్తూ ఉండలేక సహాయం చేయడానికి వెళ్ళి కోవిడ్ బారిన పడి దిక్కులేని వానిగా కనుమరుగైపోవుటకు దయగల దేవుడు ఎందుకు అనుమతించాడు? అత్యంత కఠినపరిస్థితులలో సేవను భుజాన వేసుకుని ముందుకు వెళ్ళిన తమ సేవకుడే/తమ సేవకురాలనే దేవుడు ఎందుకు తీసుకెళ్ళిపోయాడు?
అపొస్తలుడైన పేతురు 'మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్నివంటి మహాశ్రమనుగూర్చి మీకేదో యొక వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి' అని అంటూ- లోకమందున్న 'మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని యెరిగి, విశ్వాసమందు స్థిరులై ఉండండి' అని హెచ్చరించాడు. కోవిడ్ రాకముందు ఇలాంటి అనేక తెగుళ్ళు ప్రపంచంలో వ్యాప్తి చెంది అనేకులను తీసుకుపోయాయి. వాటిల్లో మిషనరీలు, వారి పసి పిల్లలు, ఎంతో భవిష్యత్ ఉన్న యౌవనస్తులు జీవితాలను అద్దంతరంగా ముగించారు. వారికి అంతగా వింత అనిపించనిది, కదిలించనిది నేడు మనకు ఏదో జరగకూడనిది జరిపోయిందనే బాధ, విశ్వాసంపై అనేక ప్రశ్నలను ఎందుకు లేవనెత్తుతున్నాయి? కోవిడ్ ప్రపంచాన్ని కబళించక ముందు లోకానికి నిత్యత్వపు వెలుగును చూపించే క్రైస్తవ్యంలో “ప్రొస్పరిటీ గాస్పల్ (Prosperity Gospel)” చాపకింద నీరులా వ్యాప్తిచెందింది. వాక్యానుసారమైన భోదవిషయంలో పట్టింపు, సత్యం విషయంలో అనుభవ జ్ఞానం లేని అనేకులు దీనిలో పడి కొట్టుకుపోయారు. ఆ ప్రభావం ఎంతో కొంత నిజ క్రైస్తవునిపై పడుట వలన క్రీస్తు బయలుపరిచిన ‘నిత్యత్వ దర్శనం’ మరుగున పడింది. దీని ఫలితమే దైవ ఆదరణ, నిత్యత్వపు నిరీక్షణ, ఆనందం ఇలాటివన్నీ ప్రక్కకు వెళ్ళిపోయి వాటి స్థానాల్లోకి అయోమయం, ప్రశ్నలు, అనుమానాలు, చింతలు ఆక్రమించాయి. దీని పరియవస్థానమే ఇంకా హృదయంలో తొలగని దుఃఖం. తమ విశ్వాసపు ఓడలకు బీటలువారి ప్రమాదకరమైన ఆథ్యాత్మిక నిరశలోకి శ్రమను అనుభవిస్తున్న విశ్వాసులు కూరుకుపోయారు.
నూతన నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా వెలువడిన నిత్యత్వాన్ని గూర్చి పరిపూర్ణ ప్రత్యక్షతలేని పాత కాలంలో లోకపరమైన దీవెనలే దైవ దీవెనెలుగా ‘ఏ తెగులు నీ గుడారమునకు సమీపించదు’ అనే వాగ్దానాలు కలిగియున్న సమయంలో అసాపు తన కీర్తనలో “భక్తిహీనులకు మరణమందు వారికి యాతనలు లేవు వారు పుష్టిగా నున్నారు. ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు. కాని చేతులు కడుగుకొని నిర్మలుడుగా ఉన్న నాకు, భక్తిపరులకు దినమంతయు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున శిక్ష వచ్చుచున్నదని వ్యాకులం చెందాడు. జవాబు కొరకు దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు- కన్నులు తెరవబడిన వాడై “ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నా కక్కర లేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై యున్నాడు” అని తన రక్షకుడైన దేవుడ్ని సన్నుతించాడు. ఆకాశంపై ఉన్న దేవుని ప్రత్యక్షతను పొంది ఆసాపు ఇలా మాట్లాడితే, ఈయనకే నూతన నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా బయలుపర్చబడిన మరణం తరువాత ఉండే నిత్యజీవితాన్ని గూర్చిన ప్రత్యక్షత అనుగ్రహించబడితే ఇంకెంతగా సన్నుతించేవాడు! ఈ ఆసాపే కనుక మరణించి పునరుత్ధానుడై లేచిన ప్రభువునే కన్నులారా చూస్తే...!!
చాలసార్లు మన భక్తిమార్గంలో ఫలితాల విషయంలో అన్యజనుల ఆలోచనా దృక్ఫతం లోకి తరచూ జారిపోయి విశ్వాస నిరీక్షణల విషయంలో బలహీనులుగా మారిపోతాము. మన భక్తికి ఫలితం; నీతినిజాయితీతో జీవించుట వలన కలిగిన కష్టనష్టాలకు బదులుగా దేవుని దీవెనలు; పరిశుద్దత కొరకు, దేవుని నామం కొరకు చేసిన త్యాగాలు ...ఇలాంటి అన్ని విషయాలలో దేవుని ప్రతిఫలాలను, తీర్పులను ఇహలోక జీవితంలోనే ఆశిస్తాము. ఇక్కడే అనేకులు అసాపు వలె ఆధ్యాత్మిక యాత్రలో కాలు జారి పడిపోయే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు.
తాను ప్రేమించిన లాజరు రోగియై యున్నాడనే వర్తమానం ప్రభువు దగ్గరకు రాకముందే, అతడు జబ్బుపడతాడని, దానితోనే అతను చనిపోతాడని యేసుప్రభువుకు తెలుసు. అతడు మరణించి, పాతిపెట్టబడిపోయి నాలుగు దినాలు అయిన తరువాత ప్రభువు తన శిష్యులతో “మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు; అతని మేలుకొలుప వెళ్లుచున్నాన”ని అంటున్నాడు. మనిషుల నమ్మకాలు, దేవునిపై విశ్వాసాలకు చాల పరిమితులు ఉంటాయి. అవి మరణం దాటి వెళ్ళవు. నిత్యత్వం విషయంలో లోకం గుడ్డిది. కనుక దేవునిపై చూపించే భక్తి లేక చేసే సహాయం ప్రతిదానికి పదింతల దైవ దీవెనలు వారు చచ్చిపోయేలోపే అనుభవించాల‘ని అనుకుంటారు. కారణం ‘మరణం’ తరువాత వారు నిరీక్షించడానికి ఏ ఒక్క ఆధారం లేదు. కాని ఇక్కడ శిష్యులు నిత్యత్వానికి సంబంధించిన అనేక విషయాలు ప్రభువు నోటనుండి వెలువడుతుంటే చెవులారా విన్నారు. ఆయన జీవితం, చేసే కార్యాలలో నిత్యజీవానికి సంబంధించిన దర్శనాన్ని కన్నులారా చూసారు. లాజరు విషయంలో ప్రభువు చెపుతున్న మాటలు విన్న శిష్యులు “-ప్రభువా, అతడు నిద్రించినయెడల బాగుపడు”నన్నారు!. ఎవరితో ఈ మాటలు అంటున్నారు? పునరుత్థానాన్ని, నిత్యత్వాన్ని బయలు పరచిన ప్రభువుతోనే! దీనిని బట్టి చెప్పవచ్చు వారి విశ్వసం ఎంత అల్పంగా, ఎంత మేర పరిమిత పరిధిలో కొట్టుమిట్టాడుతుందో!? అల్ప విశ్వాసంలో ఎప్పుడూ ఒక అడుగు ముందు ఉండే దిదుమ అనబడిన తోమా ‘ఆయనతోకూడ చనిపోవుటకు మనమును వెళ్లుదమ’ని తనతోడి శిష్యులతో అన్నాడు. యేసు పాదాల దగ్గర ఉండి నిత్యజీవపు మాటలు విన్న మరియ “ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండుననెను” విలపించింది. అందుకేనేమో నీవు ప్రేమించినవాడు రోగియైయున్నాడని యేసుకు వర్తమానాన్ని అక్కచెల్లెండ్రు అందించారే కాని చనిపోయిన తరువాత ఏ సమాచారాన్ని యేసు దగ్గరకు పంపలేదు. మరణం తటస్థించిన తరువాత ఇంకా దేనిమీద ఆశ పెట్టుకోవాలి? యేసు వచ్చినా, వున్నా ఏమి చేయగలడు? నేడు కోవిడ్ వలన మరణాన్ని చవిచూసిన కుటుంబాలు ఇలాంటి నిరుత్సాహంలోకి వెళ్ళిపోలేదా?
మరణంతో పాటు నిరీక్షణ విశ్వాసాలు అన్నీ సమాధిచేయబడిపోతాయా? అది చీకటిలో ఉన్న అన్యజనులలో జరిగినది అంటే అర్థం చేసుకోగలం. కాని వెలుగు సంబంధులైన దేవుని ప్రజలలో ఎందుకని ఈ అంధకారం అలుము కుంది? “లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును” (1 యోహాను 2:17). 'దేవుని చిత్తం' తన పిల్లల యెడల దేవుడు జరిగించే ప్రతికార్యంలోను నిత్యత్వానికి సంబందించినదై ఉంటుంది. గతించిపోయే ఈవులను ఇస్తూ భ్రమపరిచి మోసపరిచే విధానం తన పిల్లలపై ఆయన చూపే పవిత్ర ప్రేమలో చోటు లేదు. నిష్కలంకమైన దేవుని యథార్థ ప్రేమ తన పిల్లల విషయంలో జరిగే ప్రతి సంఘటనలో అవి శరీరానికి నష్టాలను కష్టాలను చేకూర్చినా వాడబారని పరలోకానికి సంబందించిన ఈవులకు చేకూర్చేవిగా ఉండాలని కోరుకుంటాడు. ఎందుకంటే “చెడ్డ వారైన ఇహలోక తండ్రులే తమ పిల్లలకు మంచి యీవుల నియ్యాలనుకుంటే పరలోకమందున్న తండ్రి అంతకంటె ఎంతో నిశ్చయముగా మంచి యీవులను ఇస్తాడుగా!“ (మార్కు 7:10,11).
నూతన జన్మ, మన జీవిత ప్రయాణంలో జరిగే ప్రతి కార్యం, మరణం అన్ని విషయాలలో నిత్యత్వానికి సంబంధించిన విషయాలలో ఏ కీడు జరగకుండా ఆయన ప్రతి దాని విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధతో కూడిన ప్రణాళిక కలిగి యున్నాడు. ఆయన చేతులు ఎంత శ్రద్ధతో మనలను సృజించాయో, మన జీవన యాత్రలో చేయిపట్టుకుని నడిపిస్తు ఎన్నెన్ని జాగ్రత్తలు తీసుకుంటాడో, అదే విధంగా మన జీవిత ప్రయాణపు ముగింపు విషయంలో ఆయన అంతే శ్రద్ధను తీసుకునేవాడుగా ఉన్నాడు. “యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది“ కీర్తనల 116:15.
ఎఫె 1:3 లో “క్రీస్తునందు పరలోకవిషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను” అని చెప్పబడింది. దీనిని బట్టి తన భక్తుల మరణం తరువాత క్రీస్తు ద్వారా ఎంతగా వారిని పరలోక సంబంధమైన వాటి విషయంలో ఆశీర్వదించాడో దానిని గూర్చి ఆలోచించం. కాని కేవలం వారు లోకం నుండి ఎలా వెడలిపోయారో దానిని గూర్చి దుఃఖిస్తాము!? ఇది ఎంత వరకు సమంజసము? పేద లాజరు దరిద్రంతో కరుపులు నాకుతున్న కుక్కల మధ్య దిక్కులేనివానిగా చనిపోయాడు. కాని అతడు దేవదూతలచేత అబ్రాహాము దగ్గరకు కొనిపోబడ్డాడు. కాని ధనవంతుడు! ఇహలోకంలో ఎంతో ఘనంగా సమాధి చేయబడియుంటాడు, కాని అతడు పాతాళం దగ్గరకు కొనిపోబడుటకాదు గదా, దానిలోకి త్రోసి వేయబడ్డాడు. ఎంత ఘనంగా చనిపోయినా, ఎంత హీనంగా పోయినా మనిషి జీవితం చేద నుండి జారిపడే నీటి వంటిది. ఆ జారిపడుటలో ఘనతను వెతుకుట జ్ఞానమా లేక మరణము తరువాత నిత్యత్వపు సంపదను అందుకొనుటకు తరలి వెళ్ళుట గొప్ప విషయమా?
మనం పుట్టక ముందే మన దినాలు ఎన్నో ఆయన గ్రంధంలో లెక్కించాడు. రాలిపోయే తల వెంట్రుకలన్నింటిని విషయంలో లెక్క కలిగియున్న ఆయన మన అంతిమ ఘడియల విషయంలో కూడా ఒక ప్రత్యేక ఉద్దేశం కలిగి ఉంటాడు. మన ప్రియులను తన దగ్గరకు తీసుకుని వెళ్లుటకు దేవుడు కోవిడ్ ను ఒక సాధనంగా వాడుకున్నాడు. తప్పుడు బోధలు, భ్రమపరిచే విశ్వాసపు అభ్యాసాల వలన తాము వెడలిపోయే ఘడియ సమీపించినది యెరుగక... సిద్దపడకపోవుట- వీటన్నింటి వలన చిట్టచివరి ఘడియలో బలపరిచే దేవుని హస్తాలవైపు కంటే స్వచిత్తాలతో నిండిన నమ్మకాలవైపు తిరిగి అనేకులు భయంతో తమ ఆఖరి క్షణాలను గడిపారు... అనేకులు నిద్రించారు. బ్రతికి ఉన్న మనకు ఇది ఒక గుణపాఠం... మనం వింటున్న దొంగ బోధలకు ఇదో హెచ్చరిక!
మన నిత్యత్వం కొరకు తన ప్రాణాన్నే ఆయన పణంగా పెట్టాడు. అలాటి దేవుడు అల్పకాల భోగాలు మన పరసంబంధమైన ఆశీర్వాదాలకు హాని కలిగించుటకు ఎలా అనుమతిస్తాడు? వాటి విలువ శరీరబలహీతలతో ఉన్న మనకు తెలియదు కాని తండ్రి యింట మనకు స్థలం సిద్ధపర్చుటకు ముందుగా వెళ్ళిన ఆయనకు అవి ఎంత విలువైనవో బాగా తెలుసు. ఎల్లప్పుడు నిత్యత్వం విషయాలలో మేల్కొని ఉండుటకు ఆయన జీవితంలోకి కష్టనష్టాలను అనుమతిస్తూ ఉంటాడు. “ప్రస్తుతమందు సమస్తశిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును” (హెబ్రీ 12:10,11). మన జీవితంలో జరిగిన ప్రతి కష్టమూ, నష్టమూ ఇహలోక పరంగా దుఃఖకరంగానే కనిపిస్తాయి కాని మరణం దాటిన తరువాత నిత్యత్వంలో అవి సమాధానకరమైన ఫలితాన్ని ఇస్తాయి. ఎందుకంటే “దృశ్యమైనవి అనిత్యములు; అదృశ్యమైనవి నిత్యములు“ (2 కొరింథు 4:18). నిత్యములైన వాటితో పోల్చి ఇహలోక కష్టాలను చూచిన అపొస్తలుడైన పౌలుకు అవి ‘క్షణమాత్రముండు చులకని శ్రమ’ గానే కనిపించాయి.
చాలమంది నేడు కళ్ళముందు కనిపిస్తున్న ఇలాటి కష్టాలను భరించుట కంటే భాహ్యంగా కనిపించని నిత్యములైన పరలోక దీవెనలు వదులుకొనుట మంచిదని నిష్టూరపడతారు. ఇప్పుడు నీవు అనుభవిస్తున్న శ్రమ, వేధన కేవలం క్షణమాత్రమైనవి అవి కూడ భరించుటకు దేవుడు కావలసిన శక్తిని, బయటపడే మార్గాన్ని అనుగ్రహిస్తాడు. ఇవేమి పట్టక కేవలం ఇహలోక క్షేమంపైన దృష్టి నిలిపితే నిత్యత్వ దర్శనాన్ని మరచినవారమై, శ్రమలు శోధన విషయంలో దేవుడు ఏర్పాటు చేసిన ఉపసమన మార్గాన్ని చెరిపివేసుకునే వారంగా ఉంటాము. ఇలాటివారు సాతాను తంత్రంలో పడి చింతలో నిరాశలలో కూరుకుని దుఃఖించే వారుగా ఉంటారు. “ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి” (ఫిలి4:4). 'ఎల్లప్పుడు' అన్ని పరిస్థితులలో తట్టుకోలేని సంఘటనలలో కూడా మన ఆత్మలకు ధైర్యాన్ని ఆనందాన్ని కలిగించే శక్తి మన ప్రభువులో ఉంది. ఇస్రాయేలీయుల అరణ్య ప్రయాణంలో బండలో జలప్రవాహం దాచి యుంచినట్లు విశ్వాసుల ప్రతి కష్టాలలో నిత్య సంతోషాన్ని అనుభవించే తరగని ప్రవాహం ప్రభువులో దాచబడివుంది.
లాజరును తిరిగి లేపుటకు వెళదాము అన్నప్పుడు అందరూ చుట్టూ అలుము కున్న ఆనాటి పరిస్థితులను భేరీజు వేసుకుని లాజరే కాదు, యూదయాకు వెళితే అందరికీ మరణమే సంభవిస్తుందని శంకించారు. అవును, రాబోయే నిమిషంలో ఏమి జరుగుతుందో తెలియని వారము. రేపు నిత్యత్వం విషయంలో స్పష్టంగా చూడలేని చీకట్లలో కొట్టుమిట్టాడుతున్న శరీరులం. కాని మన ప్రభువైన యేసుకు పగలు కనిపించినట్లే సమస్తం ఆయన కంటికి కనిపిస్తుంది. అన్నీ తెలిసిన ఆయన మార్తతో “నీ సహోదరుడు మరల లేచున’ని అన్నాడు; మార్త ఆయనతో– అంత్య దినమున పునరుత్థానమందు లేచునని యెరుగుదుననెను”. మార్తను ఒక మాట అడగాలి, మార్తా... అంత్య దినములలో నిద్రించిన వారిని లేపేది ఎవరు? ఆ యేసే నేడు నీ ముందు ఉన్నాడుగా? ఆనాడు మార్తయే కాదు నేడు చివరి రక్తపు బొట్టు వరకు కార్చి తిరిగి లేచుటకు అవకాశమే లేని తన దేహమును పునరుత్థానంతో తిరిగి లేచి ఆయనే ఆత్మస్వరూపిగా మనతోనే ఉండి ఆనాదు మార్తతో పలికినట్లే 'కోల్పోయిన నీవాళ్లు మరలా లేస్తారు' అని పలుకుతుంటే - మనం ఎలాంటి నమ్మకాన్ని కలిగియున్నాము? రేపు లోకంలో నీ జీవితయాత్ర ముగుస్తుందని తెలిస్తే పునరుత్థాన విషయంలో ఎటువంటి విశ్వాసాన్ని కలిగి యున్నావు? అంత్యదినాలలో జరగబోయే విషయాలలో పైపై విశ్వాసాన్ని ప్రదర్సిస్తూ నేడు మన ముందు జరుగుతున్న అననుకుల పరిస్థితులలో అంతగా విశ్వసించక అపనమ్మకంతో కొట్టుమిట్టాడుతున్నామా?
ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకను గ్రహించునని యెరుగుదును; అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడ వైన క్రీస్తువని నమ్ముచున్నానని మార్త ఆయనతోనే చెప్పింది... కాని నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండా ఉండేవాడని విలపిస్తుంది. నిజానికి మార్త ‘తన సహోదరుడు చావకుండా జబ్బును నయంచేస్తాడనే బయటివారు చూపే సామాన్యమైన విశ్వాసాన్ని కలిగియుండుట కాదు, చనిపోయినా తిరిగి లేస్తాడని ప్రగాఢ విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మార్తవిషయంలో ఏమోకాని... చనిపోయిన వారిని లేపిన ఇతివృత్తాలన్నింటినీ తెలుసుకున్న మనం, క్రీస్తు మరణపునరుత్థానాలను విశ్వాస నేత్రాలతో చూచిన మనం, మార్తకంటే గొప్ప విశ్వాసాన్ని కష్టకాలంలో ప్రదర్శించ బద్దులమై యున్నాము. ఆనాడు మార్తతోనే కాదు ఇంత గ్రహించినా బలహీనమైన అల్ప విశ్వాసంతో కొట్టుమిట్టాడుతూ రోధనతో గడుపుతున్న మనతోనే ఆ ప్రభువు నేడు మరలా పలుకుతున్న మాట “పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును; బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు”. మరణపు ముల్లును విరచిన యేసు ‘చావే లేద’ ని పలుకుతున్నప్పుడు, కేవలం అది ‘నిద్ర’ అని చెపుతున్నప్పుడు చనిపోయిన వారినిగూర్చి, మరణం గూర్చి చింత ఎందుకు?... “క్రీస్తునందుండి మృతులైనవారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి యుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. మనము సదాకాలము ప్రభువుతోకూడ ఉందుము. కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనినొకడు ఆదరించుకొనుడి” (2 దెస్స 4:16-18). అది ఒట్టి మాటలతో నిండిన భ్రపరచుటకు చెప్పే ఆదరణ కాదు, అవి వాస్తవమైనది, భవిష్యత్తులో జరిగితీరేవి.
‘యీ వ్యాధి మరణంకొరకు వచ్చినదికాదు గాని ...దేవుని మహిమకొరకు వచ్చినదన్న ప్రభువు ఆనాడు లాజరు విషయంలోనే కాదు చనిపోయిన నీ వారి విషయంలో కూడా ఇదే మాట అంటున్నాడు. మహమ్మారి కోవిడ్ కోరలకు నీవారు బలైపోయారని లోకం అనుకోవచ్చు, నీవూ కుమిలిపోతూ ఉండవచ్చు. 'నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును' అన్న ప్రభువు మాట ప్రకారం ప్రభువు చేత ప్రేమించబడుతున్న వీరిని రేపు పునరుత్థానపు సాక్ష్యం కొరకు చనిపోవుటకు అనుమతించాడు, దేవుని భాషలో చెప్పాలంటే 'నిద్ర'కు అప్పగించాడు. భూమి, ఆకాశం గతించినా ఆయన మాటలో ఒక్కటంటే ఒక్క పొల్లు కూడ నశించదు. మరణించినవారు గాలిలోనో మట్టిలోనో కలిసిపోలేదు. భూమిలో నాటబడిన విత్తనంవలే వారు నేడు పాతిపెట్టబడ్డారు. చిన్ని విత్తనంల్లోనే జీవాన్ని పెట్టిన ఆయనకు; ఆది యందు మట్టి మనిషిలో తన ఊపిరి ఊది జీవాత్మ గల మానవుడ్నిగా తయారు చేసిన ఆయనకు చనిపోయిన తన వారిని తిరిగి లేపుట అసాధ్యమా?
చనిపోయిన యాయీరు కుమార్తెను ఆయన స్పర్శతో కొన్ని గంటలలోనే లేపబడింది, రోగం చేత చనిపోయిన లాజరు నాలుగు దినాల తరువాత ఆయన మాటతో లేచి సజీవంగా బయటకు వచ్చాడు. నేడు నిద్రించిన తన పిల్లలు కొంత కాలం తరువాత రేపు మ్రోగబోయే కడబూర ధ్వనితో లేపబడతారు. అందరు ఆయన దృష్టిలో ఇప్పుడు కేవలం ‘నిద్రిస్సున్న వారే’! నిద్రిస్తూ, మన ప్రభువు రాకడకొరకు విశ్రాంతి తీసుకుంటున్న వారి కోరకు నీవెందుకు ఏడుస్తావు... దుఃఖంతో గడుపుతావు? ఈ క్షణమే కన్నీరును తుడుచికుని ప్రభువు ఇచ్చే ఆనందంలో పాలుపంచుకో!?
“నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును”
ఈమాట ఆనాడు మార్తతోనే కాదు.... నీతో, నీతోనే కాదు..... దుఃఖపడే వారందరితో ప్రేమించే ప్రభువు చెపుతున్నాడు. నేడైనా ఆ ప్రియుని స్వరం విని నీ కన్నీరుని తుడుచుకుంటావా?